ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం పాలక, విపక్ష సభ్యుల వాగ్వాదాలతో పెద్దఎత్తున రభస జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని, ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నగరంలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా తాము వీటితో వచ్చామని వారు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉందని వారన్నారు.
నగరంలోని సుమారు 2 కోట్ల మంది ప్రజలు తప్పనిసరిగా గ్యాస్ ఛాంబర్ లో నివసించే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా నిలదీశారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై విరుచుకుపడుతూ .. వాతావరణ సమస్యలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆక్సిజన్ సిలిండర్లను బయటకు తీసుకువెళ్లాలని, సెక్యూరిటీ ఉన్నప్పటికీ మీరు వీటిని సభ లోకి ఎలా తీసుకువచ్చారని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ..బీజేపీ సభ్యులనుద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అటు ఆప్ సభ్యులు కూడా పెద్దగా నినాదాలు చేయడంతో సభ వేడెక్కింది.
ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా జోక్యం చేసుకుంటున్నారని ఆప్ సభ్యులు చేసిన ఆరోపణను బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తూ వారితో వాగ్యుధ్ధానికి దిగారు. శిక్షణ కోసం టీచర్లను ఫిన్లాండ్ వెళ్లేందుకులెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించడం లేదని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు.
సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వరకు కాలినడకన బయల్దేరారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడు రోజులు జరగనున్నాయి. నగరంలో వాతావరణ కాలుష్యంపై పోరాటాన్ని తాము తీవ్రతరం చేస్తామని బీజేపీ హెచ్చరించింది.