ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక సందర్భంగా శుక్రవారం బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించినప్పటికీ, మేయర్ పదవి తమకే దక్కాలని బీజేపీ పట్టుబడుతోంది. తోపులాటలు, పోడియం వద్ద ధర్నాలు జరిగాయి. ఈ రెండు పార్టీల వారు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో కొందరు కిందపడిపోయారు. పెద్ద ఎత్తున నినాదాలు , కేకలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ తాత్కాలిక స్పీకర్ గా లేదా ప్రిసైడింగ్ అధికారిగా బీజేపీకి చెందిన సత్యశర్మను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నియమించడంతో దీన్ని ఆప్ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రజాస్వామ్య సంప్రదాయాలను, వ్యవస్థలను బీజేపీ తుంగలో తొక్కుతోందని ఆరోపించిన వారు.. సంప్రదాయం ప్రకారం సీనియర్ కౌన్సిలర్ ను ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని, కానీ సక్సేనా తనకు అనుకూలుడైన వ్యక్తిని ఈ పదవిలో నియమించారని వారు తప్పు పట్టారు. బీజేపీ కౌన్సిలర్లు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి, ఆప్ సభ్యులు ప్రధాని మోడీకి వ్యతిరేక నినాదాలు చేశారు. మేయర్ ఎన్నికకు ముందు .. కో-ఆప్టెడ్ సభ్యుడు మనోజ్ కుమార్ ని ప్రమాణ స్వీకారం చేయాలనీ సత్య శర్మ ఆహ్వానించడంతో ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు పరుగులు తీశారు.
ఢిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే 10 మంది నామినేటెడ్ సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించడం పట్ల ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కౌన్సిలర్ల దాడిలో గాయపడిన తన సహచరుని ఫోటోను ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మేయర్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అనుచిత పద్ధతులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
ఆప్ తమ తరఫున మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ ని, డిప్యూటీ మేయర్ పదవికి ఆలే మహమ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్ లను నిలబెట్టగా బీజేపీ తన తరఫున రేఖా గుప్తాను మేయర్ పదవికి, కమల్ భార్గీని డిప్యూటీ మేయర్ పదవికి నిలబెట్టాయి. 15 ఏళ్ళ తరువాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ నుంచి ఆప్ కైవశమయింది. 250 స్థానాలున్న ఎంసీడీలో ఆప్ 134 వార్డులను, బీజేపీ 104 సీట్లను గెలుచుకున్నాయి. రొటేషన్ పధ్దతిన ఢిల్లీ మేయర్ పదవి ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది.