గుజరాత్ అసెంబ్లీలో ముష్టి యుద్ధాలు

గుజరాత్ అసెంబ్లీ బుధవారం ముష్టి యుధ్ధాలకు ” వేదికయింది “. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం దుర్భాషలాడుతూ..దాడులకు దిగారు. వ్యక్తిగత ఆరోపణలే కాక,, పిడి గుద్దులకు దిగి తామెలాంటి ” ప్రజా ప్రతినిధులో ” నిరూపించుకున్నారు. మొదట కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ దుధత్, బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ పాంచల్ ఒకరికొకరు తిట్టుకున్నారు. ప్రతాప్ ఆవేశంతో మైకు విరిచి జగదీశ్ పై దాడికి దిగగా..ఆయనకూడా అతనిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో వీరి మద్దతుదారులు కూడా సభలో పరుగులు పెట్టి గందరగోళ వాతావరణం సృష్టించారు. సుమారు 15 నిముషాల పాటు సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ పడుతున్న వారిని నివారించేందుకు మార్షల్స్ చేసిన ప్రయత్నం ఓ పట్టాన ఫలించలేదు. చివరకు వారు ప్రతాప్ దుదత్ ను అతి కష్ట మీద బలవంతంగా బయటికి తీసుకుపోయారు. అశారాం బాపూ కేసులో జస్టిస్ డి.కె.త్రివేదీ కమిషన్ నివేదికను సభకు సమర్పించాలన్న అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఈ ” ముష్టి యుద్ధకాండ ” చోటు చేసుకుంది. కాగా స్పీకర్ రాజేంద్ర ద్వివేదీ.. ప్రతాప్ దుధత్ ను ఈ సమావేశాలు ముగిసేవరకు, ఇతర ప్రతిపక్ష సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.