పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలో నేడు కూడా పార్లమెంటులో పాలక, విపక్ష సభ్యుల మధ్య రభస తలెత్తింది. లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా, క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని, మొదట అదానీ అంశంలో జేపీసీని నియమించాలన్న తమ డిమాండ్ విషయం ఏమిటని విపక్ష నేతలు వారితో వాగ్యుధ్ధానికి దిగారు.
ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా ప్రతిష్టను దిగజార్చి మాట్లాడారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టుకుని లోక్ సభలో వెల్ లోకి దూసుకుపోయారు. వీరిని వారించడానికి స్పీకర్ ఓంబిర్లా చేసిన యత్నాలు ఫలించలేదు.
దీంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. అనంతరం అదానీ వివాదంపై ఈడీ కార్యాలయానికి ‘ఛలో ఈడీ’ పేరిట ర్యాలీగా వెళ్లాలని 18 విపక్షాలు నిర్ణయించాయి. పార్లమెంట్ హౌస్ నుంచి ఈడీ ఆఫీసు వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది.
ఇక రాజ్యసభ కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రభస కారణంగా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశాల నుంచి ఈ ఉదయం ఇండియాకు తిరిగి వచ్చారని, ఆయన నేడు గానీ,రేపు గానీ పార్లమెంటుకు హాజరు కావచ్చునని తెలుస్తోంది.