తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో బాటు అదానీ అంశంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేసింది. సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే .. కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులంతా పెద్దఎత్తున రభస సృష్టించారు. ముఖ్యంగా రాహుల్ అనర్హత సమస్యపై సభ చర్చించాలంటూ.. ప్రధాని మోడీ ప్రభుత్వ కక్ష సాధింపునకు నిరసన తెలుపుతూ వీరంతా నల్ల దుస్తులతో సభలో ప్రవేశించారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయి..స్పీకర్ ఓంబిర్లాపై పత్రాలను విసిరివేశారు.
వీరిని అదుపు చేయడానికి ఆయన చేసిన యత్నాలు విఫలమయ్యాయి. దీంతో సభను సాయంత్రం 4 గంటలవరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడడంతో సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. వరుసగా మూడో వారం కూడా పార్లమెంట్ లో ఇలా సభా కార్యకలాపాలు స్తంభించాయి.
సోమవారం ఉదయమే కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన విపక్షాలు తమ కార్యాచరణను నిర్ణయించాయి. రాహుల్ అనర్హత సమస్య, అదానీ వివాదంపై జేపీసీ ని వేయాలన్న తమ డిమాండుపై ఎట్టి పరిస్థితిల్లోనూ వెనక్కి తగ్గరాదని ఈ సమావేశంలో తీర్మానించాయి.
అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. రాహుల్ అనర్హత అంశంపై లోక్ సభలో వాయిదా తీర్మాన నోటీసునిచ్చారు. రాహుల్ అనర్హతపై చర్చించేందుకు క్వశ్చన్ అవర్ ని రద్దు చేయాలని, నేటి ఇతర సభాకార్యకలాపాలను చేబట్టరాదని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ) ప్రకారం ఓ వ్యక్తి పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం అనర్హుడైతే ఎంపీగా ఎన్నుకోబడడానికి, లేదా కొనసాగడానికి అనర్హుడని స్పష్టం చేస్తోందని, అయితే ఇదే సమయంలో ఆర్టికల్ 103 (1) ప్రకారం సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం భారత రాష్ట్రపతిపై ఉంటుందని ఆయన వివరించారు. పైగా ఆర్టికల్ 103 (2) కింద అనర్హతపై నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రపతి.. ఈసీతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందన్నారు.