పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ లోనూ ఇదివరకటి సీన్లు రిపీటయ్యాయి. లండన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉభయ సభల్లో రభస తలెత్తింది. లోక్ సభ సోమవారం సమావేశం కాగానే.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేచి.. భారత ప్రతిష్టను రాహుల్ గాంధీ విదేశాల్లో మంట గలుపుతున్నారని ఆరోపించారు. ఈ సభ రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా ఆయనతో ఏకీభవిస్తూ.. 1970 ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో ఎమర్జన్సీని విధించినప్పుడు ఈ దేశ ప్రతిష్ట దిగజారలేదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ.. సభ పోడియంలోకి దూసుకుపోయారు. వారిని వారించడానికి స్పీకర్ ఓంబిర్లా చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో సభను ఆయన మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. లండన్ లో ఆ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు ఆయన స్వయంగా సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ డిమాండ్ చేశారు.
నాడు ఎమర్జెన్సీ కాలంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదా అన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఇందుకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు చేసిన స్టేట్మెంట్లను ఈ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తావించబోగా చైర్మన్ జగదీప్ ధన్ కర్ అడ్డుకుని మధ్యాహ్నం 2 గంటలవరకు సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అదానీ, హిండెన్ బెర్గ్ రిపోర్ట్ అంశాల మీదా ఉభయ సభలూ విపక్షాల నినాదాలతో హీటెక్కాయి.