ఢిల్లీ మున్సిపల్ సమావేశంలో రచ్చ జరిగింది. నిన్న ఉదయం ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయింది. ఆ తర్వాత నిన్న రాత్రి స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఈ సమయంలో సభలో గందరగోళం ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు బాహాబాహికి దిగారు.
స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సమయంలో సభ్యులు తమ సెల్ ఫోన్లను తీసుకు వెళ్లేందుకు అనుమతిస్తామని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు. దీన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ మేరకు బీజేపీ నేతలు వెల్‌లోకి వచ్చి మేయర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అదే సమయంలో మేయర్ నిర్ణయానికి ఆప్ సభ్యులు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో సభలో తోపులాట జరిగింది. ఆప్-బీజేపీ సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లను విసురుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఓటింగ్ ప్రక్రియను మేయర్ పలుమార్లు వాయిదా వేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుండగా బీజేపీ సభ్యులు వెల్ లోకి దూసుకు వచ్చారని, తమపై దాడికి ప్రయత్నించారంటూ మేయర్ ఆరోపించారు. మహిళా మేయర్‌పై దాడికి యత్నించడం బీజేపీ నేతల గూండాగిరికి నిదర్శనమని ఆమె ట్వీట్ చేశారు.