నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కృతి శెట్టి. ఇందులో ఆమె పాత్రపై చాన్నాళ్లుగా కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. సినిమాలో ఆమె మాచర్ల నియోజకవర్గం నుంచి వచ్చిన పల్లెటూరి పిల్ల పాత్రలో కనిపిస్తుందని, హైదరాబాద్ లో చదువుకుంటున్న ఆమెను చూసి నితిన్ ప్రేమలో పడతాడంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడా వదంతులపై క్లారిటీ వచ్చేసింది.
మాచర్ల నియోజకవర్గంలో పల్లెటూరి అమ్మాయిగా నటించడం లేదు కృతి శెట్టి. ఆమె పక్కా అర్బన్ గర్ల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.
ఈ సినిమా నుంచి కృతి శెట్టిని స్వాతిగా పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ట్రెండీ అవుట్ ఫిట్ తో స్టైలిష్ గా కనిపించింది. కూల్ గా కాఫీ ఆస్వాదించడం ప్లజంట్ గా వుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, సెకెండ్ హీరోయిన్ గా క్యాథరీన్ కనిపించనుంది. మరో హీరోయిన్ అంజలి చేసిన ఐటెంసాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.
ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. సముద్రఖని మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.