అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెతను.. ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో ప్రభాస్ మూవీ అన్నట్టు మార్చుకోవాలేమో. ప్రభాస్-మారుతి సినిమాకు సంబంధించి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. రోజుకో పుకారు తెరపైకొస్తోంది. ఏది నమ్మాలో, ఏది నిజమో అర్థంకాని పరిస్థితి. అటు మేకర్స్ నుంచి కూడా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. లక్కీగా ప్రభాస్ కన్ ఫర్మ్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అంతా గాల్లో దీపం అన్నట్టు ఉండేది వ్యవహారం.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న పుకారు హీరోయిన్ల ఎంపిక. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. వీళ్లలో ఇద్దరు హీరోయిన్లుగా మాళవిక మోహనన్, మరో హీరోయిన్ గా కృతి షెట్టిని తీసుకున్నట్టు ఇప్పటికే ఊహాగానాలు చెలరేగిపోయాయి. కానీ నిజం ఏంటంటే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఎవ్వర్నీ సెలక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి మాళవిక మోహనన్ ను తీసుకోవాలా వద్దా అనే పాయింట్ దగ్గరే ఆగిపోయారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రూపాయల భారీ సెట్ వేస్తున్నారట. ఇందులో కొంత నిజం ఉంది, ఇంకాస్త అబద్ధం ఉంది. 5 కోట్ల రూపాయల ఖర్చుతో 3 సెట్స్ వేస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఆ సెట్స్ లోనే నడుస్తుందన్నమాట. ఇక ఓ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ఈ హారర్ కామెడీ వస్తోందనేది మరో పుకారు. ఇది మాత్రం నిజమే.
ప్రస్తుతం ప్రభాస్ హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. అతడు టూర్ నుంచి తిరిగొచ్చిన వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది. డీవీవీ దానయ్య ఇప్పటికే ఫస్ట్ పేమెంట్ ఇచ్చేశాడు. 60 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయాలనేది ప్లాన్. అయితే సినిమా మాత్రం ఈ ఏడాది థియేటర్లలోకి రాదు. అగ్రిమెంట్ ప్రకారం.. ఆదిపురుష్ వచ్చిన తర్వాతే మారుతి సినిమా వస్తుంది.