రాజ్యసభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కట్టతడి పెట్టుకున్నారు. ఆమె బీర్భూమ్ హింసాకాండను తలచుకుని శుక్రవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారని బాధపడ్డారు. బెంగాల్‌ను కాపాడాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రూపా గంగూలీ సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏప్రిల్ 7లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎంపీ రూపా గంగూలీ శుక్రవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనేత్తారు. కేవలం 8 మంది మాత్రమే మరణించారని, అంత కన్నా ఎక్కువ లేదని ఆమె బెంగాల్ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.
అలాగే, అటాప్సీ రిపోర్ట్ ప్రకారం తొలుత అక్కడ వాళ్లను కొట్టినట్లు తెలుస్తోందన్నారు. కొట్టిన తర్వాత సామూహిక హత్యలు జరిగినట్లు రూపా ఆరోపించారు. భారత్‌లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్‌లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు.
దీంతో రూపా గంగూలీ మాట్లాడుతున్న సమయంలో తృణమూల్ ఎంపీలు సభలో ఆందోళన సృష్టించారు. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. తృణమూల్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను వాయిదా వేశారు.
పశ్చిమ బెంగాల్‌లోనిబీర్భూమ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత మమత ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.