ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై తటస్థ వైఖరిపై అంతర్జాతీయంగా భారత్ పై పశ్చిమదేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ భద్రతా సలహాదారు కూడా భారత్ వచ్చి వెళ్లారు. రష్యాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్‌ను హెచ్చరించారు. ఇలాంటి సమయంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్ రోవ్ భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జైశంకర్.. భారత్ ఎల్లప్పుడూ వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు.
భేటీ అనంతరం లావ్రోవ్ మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. భారత్ ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటే పరస్పరం ఆమోద యోగ్యమైన సహకారంతో చర్చించుకునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆదేశాలను సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. భారత్, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు.
ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మక్కువ చూపుతుందని సెర్గీ లావ్రోవ్ చురకలంటించారు. రష్యా- భారత్ సంబంధాలపై అమెరికా ఒత్తిళ్లూ పనిచేయవని తేల్చి చెప్పారు. అయితే భారత్-రష్యా భాగస్వామ్యంపై అమెరికా ఒత్తిడి ఎంతమాత్రం పనిచేయదని, ఈ విషయంలో సందేహాలే అవసరంలేదని నొక్కి చెప్పారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా భారత్, రష్యాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు.
ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. విభేదాలను ఎల్లప్పుడు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ అభిమతం అని ఉద్ఘాటించారు. ఉమ్మడి అజెండాను మరింత విస్తరించడం ద్వారా అనేక అంశాల్లో భారత్-రష్యా భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.