దొనెట్స్క్‌లో ఇటీవల రష్యా సైన్యానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో వందల మంది రష్యా సైనికులు మరణించారు. దీనిపై రష్యా మరోసారి స్పందించింది. నూతన సంవత్సరం రోజున సైనికులు నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ ఫోన్లను వినియోగించడంతోనే ఈ దాడి జరిగినట్టు పేర్కొంది.
ఈ ఘటనలో 89 మంది సైనికులు మరణించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన సంవత్సరం రోజున తూర్పు దొనెట్స్క్ ప్రాంతంలో రష్యా సైనికులు బస చేశారు. అదే సమయంలో ఆ శిబిరంపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేసింది.
ఈ దాడుల్లో వందల మంది రష్యన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. కానీ 63 మంది మాత్రమే మరణించినట్టు రష్యా మొదట ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో రష్యన్ మిలిటరీ కమాండర్లపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రక్షణ శాఖ స్పందించింది.
మకివ్కాలోని వొకేషనల్ కాలేజీలో రష్యా సైనికులు బస చేశారని రష్యా లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ సెవ్ర్యుకోవ్ తెలిపారు. కాలేజీపై ఉక్రెయిన్ నాలుగు క్షిపణులను ప్రయోగించిందన్నారు. దాడికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ల వినియోగమేనని చెప్పారు. శత్రువుల ఆయుధాల పరిధిలో ఉన్నప్పుడు ఫోన్లపై నిషేధం ఉంటుందన్నారు. కానీ తమ సైనికులు చాలా మంది మొబైళ్లను ఆన్ చేసి ఉపయోగించారని చెప్పారు.
ఈ నేపథ్యంలో తమ సైనికుల సిగ్నల్స్‌ను శత్రువులు ట్రాక్ చేశారన్నారు. అందువల్ల తమ సైనికుల కచ్చితమైన లొకేషన్‌ను శత్రువులు గుర్తించి దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో 89 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులకు శిక్ష తప్పదని ఆయన వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది రిజర్విస్టులే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వీరంతా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నట్లు సమాచారం.