ఉక్రెయిన్ లోని పోర్టు సిటీ మరియాపోల్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలో 400 మంది శరణార్థులు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై రష్యా దాడులు చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది.
దాడుల్లో పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైందని, శిథిలాల కింద ప్రజలు చిక్కుకుని ఉండవచ్చని స్థానిక అధికారులు తెలిపారు. ప్రాణనష్టంపై తక్షణమే తాము ఏమీ చెప్పలేమని వెల్లడించారు. నగరంలోని ఓ థియేటర్ పై బుధవారం కూడా రష్యా దాడులు చేసిందన్నారు.
‘ ఈ నగరంపై ఆక్రమణదారులు చేసిన ఈ దాడి ఒక ఉగ్రచర్య. దాన్ని కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచం గుర్తుంచుకుంటుంది” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడీమర్ జెలెన్ స్కీ అన్నారు.
మరియాపోల్ అనేది అజోవ్ సముద్ర తీరంలోని ఒక నగరం. మూడు వారాలుగా ఇక్కడ రష్యా దాడులు చేస్తోంది. ఇక్కడ రష్యా దాడుల్లో కనీసం 2300 మంది వరకు మరణించారని అధికారులు చెబుతున్నారు.