ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలకమైన నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ ఆగ్నేయ జపోరిజ్జియా ప్రాంతంలోని మెలిట్ పోల్ నగరాన్ని రష్యా దళాలు శనివారం స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఉక్రెయిన్‌లోని లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసేందుకు ఎయిర్, నౌకల ఆధారిత క్రూయిజ్ క్షిపణులను రష్యా ఉపయోగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వందల సంఖ్యలో సైనిక శిభిరాలను, పలు ఎయిర్ క్రాఫ్ట్ లు, యుద్ధ ట్యాంకులను తమ సైనికులు ధ్వంసం చేసినట్టు తెలిపింది.
మెలిట్ పోల్ లో పౌరుల భద్రత కోసం రష్యా సైనికులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పింది. ఉక్రేనియన్ ప్రత్యేక దళాలు, జాతీయవాదులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా అడ్డుకుంటున్నట్టు వెల్లడించింది. అంతకు ముందు కైవ్ జలవిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
రష్యా వాదనలను బ్రిటీష్ సైనిక దళాల మంత్రి జేమ్స్ హీప్పీ ఖండించారు. ఆగ్నేయ ఉక్రేనియన్ నగరమైన మెలిటోపోల్‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగుతున్న రష్యా దళాలు ఉక్రేనియన్ ప్రతిఘటనతో నిలిచిపోయాయని తెలిపారు.