ఉక్రెయిన్ నగరాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా రష్యా సేనలు ఉక్రెయిన్ పై దాడులు చేస్తునే ఉన్నాయి. కాగా కీవ్ నగరం పై అర్థరాత్రి పూట డ్రోన్ లతో మరోసారి దాడులు చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
కీవ్ కి వ్యతిరేకంగా నెల రోజుల పాటు రష్యా సేనలు వైమానిక దాడులను కొనసాగించాయి. ఇప్పటి వరకు కీవ్ పైన దాడి చేయడానికి ప్రయత్నించిన డ్రోన్ లన్నింటినీ ధ్వంసం చేసినట్లు మిలిటరీ చీఫ్ లు ఇప్పటికే తెలిపారు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్హి పాప్కో రష్యా కీవ్ పై మరోసారి డ్రోన్లతో దాడి చేసిందని చెప్పారు.
ఈసారి ఇరాన్ లో తయారు చేసిన షాహెద్ డ్రోన్ లను ఉపయోగించి ఈ దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ కూడా అంతే స్థాయిలో రష్యా దాడులను తిప్పి కొడుతోంది. ఈ క్రమంలో దాదాపు 9 నెలలుగా బఖ్ముత్ నగరంలో భీకర పోరు కొనసాగింది.
ఈ పోరులో తమ సైనికులు 20 వేల మంది చనిపోయినట్టు ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధిపతి వెల్లడించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నియమించుకున్న మొత్తం 50 వేల మంది రష్యన్ ఖైదీలలో సగం మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.