ఉక్రెయిన్‌లోని మరో నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. తాజాగా సోలెడార్ పట్టణాన్ని రష్యా కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సోలెడార్ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడమనేది ఊరట కలిగించే విషయం.

సోలెడార్‌ను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన రష్యాకు ఊహించినట్టుగా ప్రయోజనం ఏమీ ఉండబోదని అమెరికా కేంద్రంగా పని చేసే ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది ఇలా వుంటే సోలేడార్ ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా వార్తలను ఉక్రెయిన్ ఖండించింది.
ఆ పట్టణంలో తమ సేనలు ఇంకా పోరాటం చేస్తున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ అధికార ప్రతినిధి సెర్హి చెరెవటి ప్రకటించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా తన అన్ని ప్రధాన బలగాలను పంపిందన్నారు. కానీ తమ బలగాలు ఇప్పటికీ అక్కడ వీరోచితంగా పోరాడుతున్నాయని వెల్లడించారు.