ఉక్రెయిన్ పై రష్యా మారణకాండ కొనసాగుతోంది. ఒక్కో నగరంలో విధ్వంసం సృష్టిస్తూ రష్యా సైనికులు ముందుకు వెళ్తున్నారు. అయితే.. ఉక్రెయిన్ బలగాలు కూడా దీటుగానే బదులు చెబుతున్నాయి. అయితే.. ఈ వార్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. నల్ల సముద్రం నావికా స్థావరాన్ని రక్షించడానికి రష్యా డాల్ఫిన్ లను మోహరించిందని యునైటెడ్ స్టేట్స్ నేవల్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికలో పేర్కొంది.
సెవాస్టోపోల్ నావికా స్థావరంలో రెండు సైనిక డాల్ఫిన్లను ఉంచిందట రష్యా. ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘ప్రత్యేక సైనిక ఆపరేషన్’ ప్రారంభించినప్పుడు వాటిని అక్కడకు తరలించారని నివేదికలో పేర్కొన్నారు. విధ్వంసక చర్యల్లో నౌకాశ్రయంపై దాడి చేయగల ఉక్రేనియన్ ప్రత్యేక బలగాలను దృష్టిలో ఉంచుకుని డాల్ఫిన్ లను కౌంటర్ డైవర్ కార్యకలాపాలకు ఉపయోగించేందుకు మోహరించారు.
రష్యా తన ఉత్తర నౌకాదళం కోసం ఆర్కిటిక్ లో బెలూగా తిమింగలాలు, సీల్స్ కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. వాటిని సముద్రం లోపల గూఢచర్యం కోసం వాడుతూ ఉంటుంది. క్రాయిమియాలో రష్యా మిలిటరీ డాల్ఫిన్స్ కేంద్రం ఉంది. అక్కడ వాటికి రకరకాల పనుల కోసం ట్రైనింగ్ ఇస్తుంటారు. సముద్ర ఉపరితల విశ్లేషణ నుంచి ఒక పరిధిలోని జలాల రక్షణ.. విదేశీ డైవర్లను గుర్తించడం.. విదేశీ నౌకల కింద పేలుడు పదార్థాలు పెట్టడం లాంటి పనులు చేయిస్తుంటారు.
క్రాయిమియాలో ఉన్న డాల్ఫిన్ ట్రైనింగ్ సెంటర్ మొదట్లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉండేది. కానీ.. 2014లో రష్యా నావికాదళం దానిని తమ అధీనంలోకి తెచ్చుకుంది.