ఉక్రెయిన్-రష్యా యుద్ధం 67వ రోజుకు చేరుకుంది. యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రష్యా అంటోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ధీటుగా జవాబు ఇస్తోంది. దీంతో ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు.
ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచి వెళ్లినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు 5 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా రష్యా దళాలు తమ దేశానికి తరలించాయని జెలెన్ స్కీ ఆరోపించారు.
రష్యాకు చెందిన వేయి యుద్ధ ట్యాంకులను, 200 ఎయిర్ క్రాఫ్ట్, 2500 సైనిక వాహనాలను నాశనం చేసినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో రష్యా తన దాడులను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్టు ఆయన వివరించారు. రష్యాకు తాము ఇప్పటికే చాలా నష్టాన్ని కలిగించామని ఆయన అన్నారు.
ఆయుధాల పరంగా రష్యా బలహీనపరిచామని.. ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టాన్ని రష్యా చవిచూసిందన్నారు. మే 9న మాస్కోలో జరిగే విక్టరీ డే పరేడ్ లో ప్రదర్శించడానికి కూడా రష్యా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవని తెలిపారు జెలెన్ స్కీ.