రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశానికి చెందిన 2000 మందికి పైగా పిల్లలను రష్యా కిడ్నాప్ చేసినట్టు పేర్కొంది. వారందరినీ రష్యాకు తరలించినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది.
ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. మార్చి 19న అందిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్ కు చెందిన 2389 పిల్లలను రష్యా కిడ్నాప్ చేసినట్టు పేర్కొంది.
లుహెనెస్క్, డొనెటెస్క్ ప్రాంతాల్లో ఉన్న ఆ పిల్లలను రష్యా తన భూభాగంలోకి తరలించినట్టు ఆరోపించింది. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఉక్రెయిన్ తెలిపింది.
ఆ పిల్లల ఇండ్లను ధ్వంసం చేయడం, వారి పిల్లలను చంపడం ద్వారా వారిని అనాథలుగా రష్యా మారుస్తోందని, తద్వారా పిల్లల జీవితాలను రష్యా ప్రమాదంలోకి నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది.