రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులపై భారత్ మరోసారి స్పందించింది. ఈ చర్యలను వెంటనే తగ్గించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇది భారీ విపత్తుగా పరిణమించే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధం ప్రకటించిన వెంటనే సైనిక దళాలు దాడులకు పాల్పడ్డాయి. దాదాపు 11 నగరాలపై దాడులు జరిపాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా సైన్యం అదుపులోకి తీసుకుంది. కేవలం యుద్ధం ప్రకటించిన మూడు గంటల్లోనే కీలక నగరాలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకొన్నారు.
ఉక్రెయిన్ ప్రభుత్వం మిలిటరీ పాలన విధించింది. రష్యా సైన్యానికి ధీటుగా బలగాలను దింపుతోంది. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ ఎయిర్ బేస్, మిలిటరీ స్థావరాలే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
యుద్ధం ఆపాలని చర్చలు జరుపుతున్నారు యూఎన్ ప్రతినిధులు. మరోవైపు శుక్రవారం జీ-7 దేశాలతో సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.