ఓ వైపు ఉక్రెయిన్ తో భీకర యుద్ధం కొనసాగుతుండగానే మరో వైపు ప్రపంచానికి రష్యా తీవ్ర హెచ్చరికలు పంపింది. భూమిపై ఏ టార్గెట్ నైనా చేరుకునే అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించి పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ‘ సామ్రాట్’ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఆర్ఖంగెల్స్క్ ప్రాంతంలోని ప్లెసెట్స్క్ కాస్మోడ్రోమ్ నుంచి దీన్ని రష్యా ప్రయోగించింది. రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా రష్యన్ ఆర్మీని అధ్యక్షుడు పుతిన్ అభినందించారు. ‘ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సామ్రాట్ ను విజయవంతంగా ప్రయోగించిన రష్యన్ సైన్యానికి నా అభినందనలు’ అని పుతిన్ ప్రశంసించారు.
నిజంగా ఇదొక ప్రత్యేకమైన ఆయుధమని పుతిన్ అన్నారు. ఇది తమ సాయుధ బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. దూకుడు స్వభావంతో తమ దేశాన్ని భయపెట్టేందుకు ప్రయత్నించే వారిని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా ఈ క్షిపణి చేస్తుందని తెలిపారు.
‘ అర్ఖంగెల్స్క్ ప్రాంతంలోని ప్లెసెట్స్క్ స్టేట్ టెస్ట్ కాస్మోడ్రోమ్‌లో బుధవారం మాస్కో సమయం 15:12 గంటలకు సైలో లాంచర్ నుండి సర్మాట్ స్థిర-ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించాము’ అని రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.