ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ మరో వివాదం చెలరేగింది. రష్యా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా జలాంతర్గామిని పంపిందని రష్యా ఆరోపించింది. దీంతో తమ నావికాదళం అమెరికా జలాంతర్గామిని తరిమికొట్టిందని రష్యా ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తూ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందంటూ మండిపడింది. ఈ ఘటనకు సంబంధించి మాస్కోలోని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధికి నోటీసులు జారీ చేశామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.
జపాన్ హొకాయిదో దీవుల్లోని ఉత్తరాన ఉన్న ఉన్న కురిల్స్ ప్రాంతం రష్యా అధీనంలో ఉందని తెలిపింది. సోవియట్ సేనలు దానిని ఆక్రమించుకున్నప్పట్నుంచి తామే దానిని సంరక్షిస్తున్నామని రష్యా చెప్తోంది. ఇప్పుడు ఆ కురిల్ జలాల్లోకే అమెరికా తన జలాంతర్గామిని పంపి యుద్ధ సన్నద్ధ పరీక్షలు చేపట్టిందని రష్యా ఆరోపిస్తోంది.
అయితే.. అమెరికా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. అసలు తమ జలాంతర్గామి రష్యా జలాల్లోకి ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది. రష్యా ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రష్యా చెప్తున్న ప్రాంతం గురించి తాము ఇప్పుడేం మాట్లాడబోమని పేర్కొంది. అయితే.. అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ప్రయాణించే అధికారం, హక్కు తమకుందని అమెరికా మిలటరీ అధికార ప్రతినిధి కెప్టెన్ కైల్ రైయిన్స్ చెప్పారు.
Advertisements
కాగా.. ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య.. అమెరికా, రష్యాలు ఇప్పటికే పరస్పర హెచ్చరికలు చేసుకున్నాయి. తాము రష్యాతో యుద్ధమంటూ చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధం లాంటిదే అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. తాము దాడికి దిగితే రష్యా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా.. ఇప్పటికే ఉక్రెయిన్ కు మూడు దిక్కులా లక్ష మంది సైనికులను రష్యా మోహరించింది.