ఇండియాలో 200 వందే భారత్ రైళ్ల తయారీ కోసం భారత సంస్థకు రష్యన్ కంపెనీ ఒకటి సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఇండియన్ ఇంజనీరింగ్ సంస్థ భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్, కోల్ కతా లోని తితాఘర్ వేగన్స్ టై అప్ కాగా, రష్యా లోని ట్రాన్స్ మాష్ హోల్డింగ్ కంపెనీ సైతం ఇందుకు తక్కువ టెండర్ ధరను కోట్ చేసింది. ట్రైన్ సెట్ కి రూ. 139.8 కోట్ల బిడ్ ను ఈ సంస్ధ ప్రకటించింది.
ఇదే సమయంలో ఒక్కో ట్రైన్ సెట్ కి రైల్వే శాఖ ఆధీనంలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ. 120 కోట్లను కోట్ చేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. రష్యాతో తన వాణిజ్య సంబంధాలను ఇండియా తగ్గించుకోవాలని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ ‘ధర’ కు టెండర్ పాడాలన్నదే ఈ సంస్థ ఉద్దేశం.
ఇప్పటివరకు ఇండియా.. వందే భారత్ రైళ్ల విషయంలో ఇంత భారీ టై అప్ కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ రైళ్లలో సీటింగ్ ఏర్పాట్లు మాత్రమే ఉండగా ఇకపై స్లీపర్ వెర్షన్స్ తో కూడిన రైళ్లు కూడా రానున్నాయి. ఇక తాజా బిడ్డింగ్ లో జర్మనీ, ఫ్రెంచ్ సంస్థలు కూడా పోటీ పడ్డాయి.
హైదరాబాద్ లోని మేథా కంపెనీతో స్విస్ సంస్థ ‘స్టాడ్లర్’..పార్ట్ నర్ షిప్ కుదుర్చుకుంది. వందే భారత్ రైళ్లలో ప్రొపల్షన్ సిస్టం సప్లయ్ కి ఈ కంపెనీ తోడ్పాటునందిస్తుంది. ఇది తక్కువ కోట్ చేసిన ఐదో సంస్థ. 2 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా ట్రైన్ సెట్ల తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 35 ఏళ్ళ పాటు వీటి మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఈ సంస్థలదే. మహారాష్ట్ర లోని లాతూర్, హర్యానా లోని సోనే పట్, చెన్నై లోని ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ వంటి రైల్వే ఫ్యాక్టరీల్లో ట్రైన్ సెట్స్ తయారవుతాయి.