ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా పట్టు బిగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన కీలక నగరమైన మరియాపోల్ ను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఈ నగరంపై రష్యా పట్టు సాధించడం గమనార్హం. అయితే రష్యాకు తమ బలగాలు ధీటైన సమధానం ఇస్తున్నాయని ఉక్రెయిన్ చెబుతోంది.

ఈ క్రమంలో మరియూపోల్‌లో చిక్కుకున్న పౌరులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అందుకోసం బ్రిటన్, స్వీడన్ దేశాధినేతల సహాయాన్ని కోరినట్టు చెప్పారు.
‘ రష్యా బలగాలను గట్టి సమాధానం చెప్పడం లేదా దౌత్యం ద్వారా సమస్య పరిష్కారంపైనే మరియా పోల్ విధి ఆధారపడి ఉంది. యుద్ధానికి అవసరమైన యుధ్ద సామాగ్రిని భాగస్వామ్య దేశాలు తమకు వెంటనే అందజేయాలని, అలా చేస్తేనే రష్యా సేనలకు తిప్పికొట్టగలం. తద్వారా ఈ నగరంపై ఆక్రమణదారుల ఒత్తిడిని గణనీయంగా తగ్గించగలుగుతాం. తద్వారా దిగ్బంధాన్ని విచ్చిన్నం చేయగలుగుతాం. లేదంటే చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఇందులో భాగస్వామ్య పక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలి’ అని అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.
ఇది ఇలా ఉండగా ఉక్రెయిన్ కు ఈయూ సభ్యత్వం విషయంలో ముందడుగు పడింది. సభ్యత్వం కోసం అవసరమైన దస్త్రాలను ఉక్రెయిన్ పూర్తిచేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు కార్యాలయ డిప్యూటీ హెడ్ ఇహోర్ జోవ్క్వా ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈయూ కమిషన్ నిర్దేశించిన సభ్యత్వ ప్రమాణాలకు ఉక్రెయిన్ సమ్మతిపై సిఫార్సును జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్ణయం ఈయూ సభ్యత్వ దేశాల చేతుల్లో ఉంది’ అని ఆయన తెలిపారు. ఈయూ కౌన్సిల్ జూన్ చివరలో నిర్వహించే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని జోవ్క్యా తెలిపారు.