ఉక్రెయిన్- రష్యాల మధ్య రెండో విడత శాంతి చర్చలు బెలారస్ లో ముగిశాయి. ఉక్రెయిన్ నుంచి సాధారణ పౌరులను తరలించేందుకు వీలుగా ప్రత్యేక మానవతా కారిడార్లను ఏర్పాటు చేసేందుకు చర్చల సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి.
రెండో విడత చర్చల కోసం బెలారస్ లోని బ్రెస్ట్ ప్రాంతంలో ఇరు దేశాల ప్రతినిధులు గురువారం సమావేశం అయ్యారు. అయితే పలు అంశాలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
‘ రెండో విడత శాంతి చర్చలు ముగిశాయి. దురదృష్టవశాత్తు, ఉక్రెయిన్ ఆశించిన ఫలితాలను ఈ చర్చల్లో సాధించలేకపోయింది” అని ఉక్రెయిన్ అధ్యక్షుని సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి దీనిపై ట్వీట్ చేశారు. ‘ ఈ పరిస్థితికి వారు(ఉక్రెయిన్) ముగింపు పలుకుతారని ఆశిస్తున్నాను. డాన్ బాస్ లో శాంతిని పునరుద్ధరిస్తారని, ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ తిరిగి శాంతియుత జీవితం గడిపేలా వీలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము” అని ట్వీట్ చేశారు.