మా దాడి ఉక్రెయిన్ ప్రయోజనాల ఉల్లంఘన కాదు. ప్రస్తుత దాడి సంఘటనలకు దానికి ఎలాంటి సంబంధం లేదు. బందీలుగా పట్టుకున్న వారిని రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రక్షణ కోసమే ఇదంతా జరుగుతోంది- పుతిన్
తమపై యుద్ధానికి దిగిన రష్యాపై ప్రతీకార చర్యలు చేపట్టింది ఉక్రెయిన్. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
దేశాన్ని రక్షించాలనుకుంటున్న పౌరులు ఎవరికైనా ఆయుధాలు ఇస్తాం. ఉక్రెయిన్ కు మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి- జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
రష్యా దాడుల్లో ఏడుగురు చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది.
రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలమట్టం చేసినట్లుగా తెలిపింది.
ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లుగా రష్యా ప్రకటించుకుంది.
ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల మద్దతు కోరింది. రష్యా దుశ్చర్యను ఖండించాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించాయి. ఆర్థిక, రక్షణ, సామాగ్రి పరంగా ఉక్రెయిన్ దేశానికి సహకరిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది.
రష్యా దాడులపై ఐక్యరాజ్యసమితిలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగి రెండు దేశాలు పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలైన డొనెట్స్క్ , లుహాన్స్క్ లలో రష్యా సైన్యం దాడులకు దిగిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ ప్రకటన చేశారు.
తమను తాము రక్షించుకొని విజయం సాధిస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిముత్రో కులేబా తెలిపారు. శాంతియుతంగా ఉండే ఉక్రెయిన్ నగరాలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. రష్యాను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని కోరారు.
రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో ఎయిర్‌పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్. తూర్పు ఉక్రెయిన్ లోని గగనతలాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ పైనుంచి ఎలాంటి విమానాలు రాకపోకలు సాగించడం లేదు.
ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం వెనక్కి తిరిగొచ్చేసింది. గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ‘ఏఐ 1947’ ఎయిరిండియా విమానం కీవ్ కు బయల్దేరింది. ఆ తర్వాత యుద్ధం కారణంగా గగనతలాన్ని మూసేసింది ఉక్రెయిన్. ఎయిర్ మిషన్ సూచనల మేరకు అధికారులు విమానాన్ని మళ్లీ భారత్ కు మళ్లించారు.
ఇటు కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు ఢీల్లీకి చేరింది. అందులో 182 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.
రష్యా చేసే దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత. తమ మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తాం- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్