కొవిడ్-19 మూడు దశల పరిణామాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతల రూపంలో మరో ముప్పు ఆందోళనను పెంచుతోంది. దీంతో వాణిజ్య పరంగా ప్రత్యక్ష ప్రభావం కంటే.. యుద్ధం వస్తే వివిధ దేశాలపై భద్రతాపరంగాను, ఆర్థికంగాను ప్రతికూల ప్రభావం పడొచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలున్నాయి.
ఇప్పటికే ముడిచమురు బ్యారెల్ ధర ఏడేళ్ల గరిష్ఠమైన 97 డాలర్లకు చేరడం అనేది దిగుమతులపైనే అధికంగా ఆధారపడిన భారత్ వంటి దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇందువల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలతో, స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు నెలకొంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ తో వాణిజ్య సంబంధాలున్న దేశాలకూ కొంత ఇబ్బందికరమే అంటున్నారు నిపుణులు. మనదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉక్రెయిన్ కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటిల్లో ఔషధాలదే సింహభాగం. విలువపరంగా ఉక్రెయిన్ కు ఔషధాలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్ మూడోది. జర్మనీ, ఫ్రాన్స్ లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మన దేశానికి సన్ ఫ్లవర్ నూనెను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. రసాయనాలు, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్ లాంటివి కూడా ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుతున్నాయి. ఉక్రెయిన్ కు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ కు ఎగుమతులపరంగా భారత్ అయిదో ప్రధాన దేశమని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల తాజా ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలిస్తే ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యంపైనా ప్రభావం పడొచ్చనే అంచనాలను వేస్తున్నారు నిపుణులు.
ర్యాన్‌బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ గ్రూపు తదితర భారత కంపెనీలకు ఉక్రెయిన్ లో కార్యాలయాలున్నాయి. ఈ కంపెనీలు అక్కడ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యాన్‌ఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. రియాక్టర్లు/ బాయిలర్ యంత్రాలు, మెకానికల్ సామగ్రి, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకు లాంటి వాటినీ ఉక్రెయిన్ కు భారత్ ప్రధానంగా ఎగుమతి చేస్తోంది.