ఉక్రెయిన్ లోని బుచా పట్టణంలో రష్యా సైనికుల నరమేధానికి సంబంధించిన పోస్టులను ‘ బుచా కిల్లింగ్స్’ పేరిట హ్యాష్ ట్యాగ్ చేయకుండా మెటా కంపెనీకి చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు సోమవారం బ్లాక్ చేశాయి.
అయితే తాజాగా ఆ హ్యాష్ ట్యాగ్ లను అన్ బ్లాక్ చేస్తున్నట్టు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు ప్రకటించాయి. హింసాత్మక కంటెంట్‌ను నిరోధించే ఆటోమేటెడ్ సిస్టమ్ కారణంగా తమ సోషల్ మీడియా సైట్ హ్యాష్‌ట్యాగ్‌లను ఇటీవల బ్లాక్ చేసినట్టు సంస్థ తెలిపింది.
‘ పోస్టుల్లో గ్రాఫిక్ కంటెంట్ కారణంగా ఈ హ్యాష్ ట్యాగ్ లను ఆటోమెటెడ్ గా మా వెబ్ సైట్స్ బ్లాక్ చేశాయి. ఈ సమస్య గురించి సోమవారం మా దృష్టికి వచ్చింది. దీంతో హ్యాష్ ట్యాగ్ లను అన్ బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకున్నాము’ అని మెటా ప్రతినిధి అండీ స్టోన్ తెలిపారు.
ఉక్రెయిన్ లోని బుచా నగరంలో 300 మందికి పైగా పౌరులను రష్యా సైనికులు ఊచకోత కోశారు. వారి మృత దేహాలను ఒకే చోట సామూహికంగా ఖననం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
సామూహిక ఖననం కోసం ఏకంగా 45 అడుగుల గుంత తవ్వినట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపించినట్టు మ్యాక్సర్ టెక్నాలజీస్ అనే సంస్థ వెల్లడించింది.