– రష్యా దూకుడు..తగ్గేదేలే అన్నఉక్రెయిన్
– బాంబుల వర్షం.. పెరుగుతున్నమృతులు
– అమెరికా,బ్రిటన్,జర్మనీ,జపాన్..కన్నెర్ర
– రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలు
– భారత్ తలుచుకుంటే..యుద్ధం ఆగుతుంది!
– ఉక్రెయిన్ దౌత్యవేత్తల వేడుకోలు
యుద్ధభేరి మోగింది. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ గగనతలంపై యుద్ధ విమానాల హోరు మొదలైంది. రాజధాని కీవ్ స్వాధీనమే లక్ష్యంగా రష్యా సేనలు కదులుతున్నాయి. అడపాదడపా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా యుద్ధ విమానాలు. అటు.. ఉక్రెయన్ లోని దాదాపు 20 వేల మంది భారతీయుల్లో కేవలం రెండువేల మంది దాకా వెనక్కి రాగలిగారు. కనీసం 18 వేల మందికి పైనే అక్కడ చిక్కుబడి పోయారు.వారిలో చాలా మంది విద్యార్థులే.అంతా క్షేమంగా ఉన్నట్టు సమాచారం.
ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో కనీసం వంద మంది మృతి చెంది ఉంటారని వారిలో కొందరు పౌరులు కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. భారతీయులు మాత్రం క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ యుద్ధం ఎందుకు?
యూరప్ పెద్దన్నరష్యా..ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.ఇది సరైంది కాదని హెచ్చరించినా పుతిన్ తగ్గడం లేదు.ఇప్పటివరకు ఉక్రెయిన్ లో 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి రష్యా సైనిక దళాలు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.ధ్వంసం అయిన వాటిలో 11 ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి.ఉక్రెయిన్ తో పాటు సోవియట్ దేశాలకు నాటోలో సభ్యత్వం ఇవ్వొద్దని..నాటో బలగాలను సెంట్రల్, ఈస్టర్న్ యూరోప్ నుంచి వెనక్కి తీసుకోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలోనే అసలు గొడవ మొదలైంది.తమ మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు పుతిన్. అయినా కూడా ఉక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లోని ప్రత్యేక ఉద్యమకారులకు మద్దతు ప్రకటించారు పుతిన్. దీంతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరి యుద్ధానికి దారితీసింది.
గురువారం ఉదయం ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అలా ఆయన ప్రకటన వచ్చిందో లేదో.. సైన్యం ఆపరేషన్ స్టార్ట్ చేసింది. రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపించింది. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా కూడా రష్యా వెనకడుగు వేయ లేదు. ఏవీ పట్టించుకోకుండా దాడులకు పాల్పడింది.ఉక్రెయిన్ ను చుట్టుముట్టి ముప్పేట దాడి చేసింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. దీనివల్ల కలిగే విధ్వంసం,ప్రాణనష్టానికి ఆ దేశమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు అధ్యక్షుడు బైడెన్.రష్యా యుద్ధం ప్రారంభించిన కాసేపటికే ఎయిర్ పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్.గగనతలాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించింది. తమ టార్గెట్ జనావాసాలు కాదని ప్రకటించినా ప్రాణనష్టం భారీగానే జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. రెండు దేశాలకు సంబంధించి వందల సంఖ్యలో సైనికులు, పౌరులు చనిపోయినట్లుగా చెబుతోంది.
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన దాడులను తీవ్రంగా ఖండించింది నాటో. వెంటనే సైనిక చర్యను ఆపి వెనక్కి వెళ్లిపోవాలని సూచించింది. నిరంకుశత్వం కంటే ప్రజాస్వామ్యం, అణచివేతపై స్వేచ్ఛ ఎల్లప్పుడూ బలంగా ఉంటుందన్నారు నాటో సెక్రెటరీ జనరల్. ఇందులోని 30 సభ్య దేశాలు ఇప్పటికే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ సరఫరా చేస్తున్నాయి. శుక్రవారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటించాయి. చైనా మాత్రం రష్యాకు సపోర్ట్ గా ఉంది.
ఉక్రెయిన్ పై దాడిని పుతిన్ సమర్దించుకున్నారు. తమ దాడి ఉక్రెయిన్ ప్రయోజనాల ఉల్లంఘన కాదని చెప్పారు. ప్రస్తుత దాడి సంఘటనలకు దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బందీలుగా పట్టుకున్న వారిని రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రక్షణ కోసమే ఇదంతా జరుగుతోందని వివరించారు.
మరోవైపు రష్యా, ఉక్రెయిన్ పరిణామాలపై భారత ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యుద్ధ పరిస్థితులు, భారత్ పై తక్షణ ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమీక్షలో హోంశాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.