ఆప్ఘనిస్థాన్ విషయంలో పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్టయింది.తాలిబన్ ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిపించాలనుకుకున్న రష్యా,అమెరికాకు చైనా ఎంట్రీతో భంగపాటు తప్పడం లేదు.తాలిబన్లు అనూహ్యంగా చైనాను తమకు అత్యంత మిత్రదేశంగా భావించడమే గాక,సంబంధాలు కూడా ప్రారంభించడంతో రెండు దేశాలకు గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్టయింది. పాకిస్థాన్ సాయంతో చైనా ఆప్ఘనిస్తాన్‌పై పట్టు బిగిస్తుండటంతో..అగ్రరాజ్యాలు అమెరికా,రష్యా చూపు భారత్‌పై పడింది.ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత..అమెరికా, రష్యా దేశాలు వేటికవి తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వేర్వేరు దారుల్లో, వేర్వేరు దేశాలతో కలిసి ప్రయత్నించాయి. ఈక్రమంలో ఆప్ఘనిస్థాన్‌కు పొరుగునే ఉన్న భారత్‌ను అవేవీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే డ్రాగన్ కంట్రీ.. పాకిస్థాన్ సాయంతో తజకిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్‌తో సమావేశం ఏర్పాటు చేసి.. తమను దూరం పెట్టిందో అప్పుడు రష్యాకు అసలు విషయం అర్థమైంది.
అప్ఘనిస్థాన్ విషయంలో ఇకపై చైనానే డ్రైవర్ సీటులో కూర్చోబోతోంది. దీంతో భారత్ సాయం అవసరం రాక తప్పలేదు ఆ దేశానికి. అటు అమెరికా పరిస్థితి కూడా దాదాపు ఇదే కావడంతో.. ఎప్పటికప్పుడు కొత్తగా భారత్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా, రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్, భద్రతావిభాగ అధికారులు హుటాహుటిన డిల్లీకి వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్తో సమావేశమయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్ విషయమే కాదు.. త్వరలో అతి ముఖ్యమైన రెండు ప్రపంచ స్థాయి కీలక సమావేశాలు ఉన్నాయి. ఈ నెల 16న షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్(SCO) మీటింగ్ జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 24వ తేదీన అమెరికాలో క్వాడ్ మీటింగ్ జరగనుంది. SCOలో రష్యాది అప్పర్ హ్యాండ్ కాగా, క్వాడ్‌లో అమెరికాది పై చేయిగా కొనసాగుతోంది. ఈ రెండు భేటీల్లోనూ తాలిబన్ ప్రభుత్వ అంశమే ప్రధాన ఎజెండా కానుంది. ఈ రెండింటిలో భారత్‌కు ప్రాతినిధ్యం ఉంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ మీటింగ్‌లకు ప్రధాని మోడీ హాజరవుతారు. సరిగ్గా దానికి ముందే అమెరికా, రష్యా ప్రతినిధులు భారత్లో పర్యటించడం గమనార్హం.