ఉక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు రష్యా దారుణాలకు వడికడుతోంది. రాజధాని కీవ్ తో పాటు.. పలు కీలక నగరాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతోంది రష్యా సైన్యం. నివాసాలు, ఆసుపత్రులు, బడులతో పాటు.. సామాన్యులు తలదాచుకుంటున్న శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని లివీవ్ విమానాశ్రయం సమీపంలో మాస్కో సేనలు క్షిపణులతో దాడులు చేశాయి. విమానాశ్రయానికి ఎలాంటి నష్టం జరగలేదని.. లివీవ్ లో మాత్రం మూడు భారీ పేలుళ్లు సంభవించాయని ఓ సైనికుడు తెలిపాడు.
గత కొద్దిరోజుల్లోనే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి సుమారు 2 లక్షల మంది తలదాచుకోవడానికి తరలివచ్చారని పేర్కొన్నాడు. యుద్ధారంభం నుంచి 30 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ వాసులు దేశాన్ని విడిచివెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వేల మంది చనిపోయినా, కచ్చితంగా ఎంత సంఖ్య అన్నది మాత్రం తెలియడంలేదని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్ లో ఇదే విషయమై ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సహకరించవద్దని చైనాను కోరారు.
మరోవైపు దొనెట్స్క్ వేర్పాటువాద బలగాలతో కలిసి రష్యా బలగాలు మరియుపోల్ నడిబొడ్డున భీకర పోరాటానికి దిగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈనేపథ్యంలో “పుతిన్ ప్రేరేపిత, అవమానకర యుద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి రష్యా వెంటనే ఉక్రెయిన్‌పై దాడులను ఆపాలి. అక్కడి నుంచి తన బలగాలను ఉపసంహరించుకోవాలి” అని జీ-7దేశాల ఆర్థిక మంత్రులు ఓ ఉమ్మడి ప్రకటనలో డిమాండ్ చేశారు.
బ్రిటన్ ప్రసార నియంత్రణ సంస్థ ‘ఆఫ్ కామ్.. రష్యా ప్రభుత్వ నిధులతో నడిచే టెలివిజన్ ఛానెల్ రష్యా టుడే లైసెన్సును రద్దు చేసింది. రష్యాను నిలువరించేందుకు ఆస్ట్రేలియా, జపాన్ లు తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాయి. రష్యన్ బిలియనీర్లు ఒలేగ్ డెరిపాస్కా, విక్టర్ వెక్సెల్‌బర్గ్ సహా.. 11 బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలను ఆస్ట్రేలియా తన ఆంక్షల జాబితాలో చేర్చింది. జపాన్.. మరో 15 మంది రష్యన్ కుబేరులతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ ఎగుమతిదారు రోసోబోరోన్ ఎక్స్‌పోర్ట్ తదితర 9 సంస్థలపై నియంత్ర ఆంక్షలు ప్రకటించింది.