రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. దానిపై భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత పర్యటనకు విచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి.
క్లిష్టమైన అంతర్జాతీయ వాతావరణ పరిస్థితుల మధ్య భారత్, రష్యా మధ్య విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని జైశంకర్ పేర్కొన్నారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు అనేక రంగాల్లో క్రమంగా వృద్ధి చెందుతున్నాయని జైశంకర్ తెలిపారు. వివాదాలను భారత్ ఎల్లప్పుడూ చర్చల ద్వారా పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతోందని జైశంకర్ స్పష్టం చేశారు.
కాగా.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి ప్రశంసించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని భారత్ ఒక వైపు నుంచి మాత్రమే కాకుండా సమగ్ర కోణంలో చూసిందని లావ్రోవ్ పేర్కొన్నారు.
భారత్, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆదేశాలను సమతూకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమా ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేశామని వివరించారు లావ్రోవ్.