ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర తీవ్రమవుతోంది. పోర్టు నగరమైన మరియుపోల్ లోకి రష్యా సేనలు చొచ్చుకెళ్లాయి. ఈ నగరం రష్యా హస్తగతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎటు చూసినా శవాల కుప్పలు, శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ప్రాణాలతో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
ఫుడ్ స్టోర్లలోకి చొరబడి ఆహారాన్ని వెతుక్కుంటున్నారు. కొన్ని చోట్ల మంచును కరిగిస్తే గానీ దాహం తీరని పరిస్థితులు నెలకొన్నాయి. నగరానికి ఆహార పదార్థాలను తీసుకెళ్లే కాన్వాయ్ పై రష్యా దళాలు దాడి చేశాయని ఉక్రెయిన్ తెలిపింది. సురక్షిత కారిడార్ ఏర్పాటు చేసినప్పటికీ దాడులు చేస్తోందని ఆరోపించింది.
ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వేలాది మంది విదేశాలకు తరలివెళ్తున్నారు. శనివారం ఎనిమిది మానవతా కారిడార్ల గుండా.. 6,623 మంది పొరుగు దేశాలకు వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిపోవాలని ఉక్రెయిన్ వాసులను రష్యా సైనికులు బెదిరిస్తున్నారని మరియుపోల్ సిటీ కౌన్సిల్ పేర్కొంది. షెల్టర్లలో ఉన్న మహిళలు, చిన్నారులను సైతం బయటకు పంపిస్తున్నారని ఆరోపించింది.
రష్యా దళాలు మరియుపోల్ వాసులపై కనీస జాలి చూపడం లేదు. నగరం నుంచి బయటకు వచ్చిన వారికి ఆహారం, నీరు అందించడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు అధికారి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో మాట్లాడారు. మరియుపోల్ ను భూమ్మీద నుంచి పూర్తిగా తుడిచిపెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సహా ఇతర దేశాలు తమకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదని అన్నారు.