ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి మూడు నెలల కాలం పూర్తయిందని ఇకనైనా ఆ యుద్ధాన్ని ఆపేయాలంటూ రష్యాకు చెందిన పర్వతారోహకురాలు కోరారు. కాట్యా లిప్కా అనే పర్వతారోహకురాలు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించారు. ఈ సందర్బంగా ఆమె అక్కడ ఉక్రెయిన్ జెండాను ఎగురవేశారు.
ఆమె గత శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరెస్ట్ శిఖరంపై జెండాను ఆవిష్కరించిన చిత్రాన్ని షేర్ చేసింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని లిప్కా ఖండించారు. యుద్ధం చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కొన్ని వేల మంది ప్రాణాలు పోవడం తప్ప.. పుతిన్ జీ ఇకనైనా మీరు ఉక్రెయిన్ వాసులపై కరుణ చూపాలి.. యుద్ధాన్ని ఇంతటితో ముగించండి అంటూ కోరారు.
యుద్ధం గురించి కాట్యా ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో ఆమెపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా చాలా మంచి పని చేశారంటూ అభినందిస్తున్నారు. అయితే.. కొందరు మాత్రం ఈ చిత్రాల గురించి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిత్రంలో ఆమె వెనుక అంతా చీకటిగా ఉందని.. ఆమె ఎటువంటి పర్వతారోహణ చేయకుండా చేసినట్లు చెబుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలను కాట్యా ఖండించారు. ఈ చిత్రాలు ఒరిజినల్ అని ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని వివరించారు. అవి తెల్లవారుజామున తీసిన చిత్రాలని పేర్కొన్నారు.