రష్యాలోని సైబీరియాలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. అడవుల్ని కాల్చేస్తూ.. గ్రామాల్ని మింగేస్తూ ముందుకు సాగుతోంది. అయితే మంటల ధాటికి పైకి లేచిన పొగ ఉత్తరధృవాన్ని తాకిందట. దీనికి సంబంధించిన ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసింది.
చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదని చెప్పుకొచ్చింది నాసా. కార్చిచ్చు కారణంగా ఏర్పడిన పొగ 3వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరధృవానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈశాన్య సైబీరియాలోని సఖా-యాకుటియా రిపబ్లిక్ లోని గ్రామాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 3,600 మంది సిబ్బంది కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.