ఉక్రెయిన్ మంత్రి అంటోన్ గెరాశ్చెన్కో సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి సంబంధించి ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కు, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి సెర్జెయ్ షోగూకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఫలితంగా షోగూకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆయన ఆరోపించారు.
ఉక్రెయిన్ పై చేపట్టిన మిలటరీ ప్రత్యేక ఆపరేషన్ ఫెయిల్ కావడానికి పూర్తిగా రక్షణ మంత్రే కారణమంటూ షోగూతో పుతిన్ వాగ్వాదానికి దిగారని అంటోన్ తెలిపారు. దీంతో షోగూకు గుండె నొప్పి వచ్చిందని ఆయన అన్నారు.
మార్చి 11 నుంచి రక్షణ మంత్రి బయట కనిపించక పోవడానికి కారణం ఇదేనంటూ ఆయన చెప్పారు. అయితే మార్చి 24న మరోసారి షోంగూ టీవీలో కనిపించారని కానీ అది పాత వీడియోనా లేదా కొత్తదా అన్న విషయం తెలియదన్నారు.
ఇటీవల రష్యా రక్షణ మంత్రి కనిపించకపోవడంపై పలు ఆరోపణలు వస్తు్న్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలైన ఖార్కీవ్, కీవ్ లను రష్యా ఇంకా తన స్వాధీనంలోకి తీసుకోకపోవడంతో షోంగూను రష్యా శిక్షించిందని, అందుకే ఆయన కనిపించడం లేదని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
అంతకు ముందు దీనిపై రష్యా అధ్యక్ష భవన ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ… ఉక్రెయిన్ పై ప్రత్యేక ఆపరేషన్ జరుగుతున్నప్పుడు రక్షణ శాఖ మంత్రి బిజీగా ఉండటం సహజమని, మీడియాతో తీరిగ్గా సమావేశాలు నిర్వహించేందుకు ఇది సరైన సమయం కాదని ఆయన అన్నారు.
ఆయన మాట్లాడిన కొద్ది గంటల తర్వాత రక్షణ శాఖ మంత్రి మీడియాలో దర్శన మిచ్చారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కు నివేదిక ఇస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఇది పాత ఫుటేజ్ అంటూ కొన్ని మీడియా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ మంత్రి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.