శ్రీ శ్రీ కూడా ఊహించలేదేమో. ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే – “మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె, నక్కల వలె” అని కాకుండా… “మనదీ ఒక బ్రతుకేనా ? దొర రాజ్యంలో సామాన్య మనిషి వలె” అని రాసి వుండేవారేమో! దొర రాజ్యం మళ్ళా వస్తుందని ఊహించి వుండరు. ఇది నిజం, ఇదే నిజం! ఈనాడు…కుక్కకి వున్నా విలువ ఐదేళ్ల రుత్వికకు లేదు మరీ…కడుపుమండదా, ఏ మనిషికయినా?
ఐదేళ్ల రుత్విక తెలుసా మీకు? సికింద్రాబాద్ లాలాపేట్‌లో ఉండేది. ఔను ఉండేది. 4 సెప్టెంబర్ రోజు వరకు. అందరి తల్లిదండ్రులానే రుత్విక కన్నవాళ్ళు కూడా ఆ చిట్టితల్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనుకోకుండా ఒక రోజు జ్వరం వచ్చింది. మామూలు జ్వరమనే అనుకున్నారు. ఎందుకంటే, ఒక రెండు రోజుల ముందు 13 ఏళ్ల జాన్ విన్స్టన్ డెంగీతో చనిపోతే, అస్సలు నగరంలో విష జ్వరాలు లేవు, మీరు కంగారు పడద్దు. ఇది కేవలం అభూత కల్పన అని సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖా మంత్రివర్యులు జిల్లా అధికారులతో చర్చలు, విశ్లేషణలు జరిపి మరీ చెప్పారు. చాలామందిలా రుత్విక తల్లిదండ్రులు కూడా అది నిజమనే నమ్మారు. కానీ నిజం అర్ధం అయ్యి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి వైద్యం మొదలు పెట్టేటప్పటికీ రుత్విక దక్కలేదు. తనకి ఇంకా ఎప్పటికీ ఐదేళ్లే!
రుత్విక గురించి తెలిసిన వెంటనే తొలివెలుగు స్పందించింది. GHMC అధికారులను, యంత్రాంగాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ వేదికగా ఒక సందేశం పంపింది. అందరం ఆశ్చర్యపోయేలా “అసౌకర్యానికి చింతిస్తున్నాము, కాంటాక్ట్ నెంబర్ ఉంటే పంపించండి” అని క్లుప్తంగా మెసేజ్ పెట్టారు. వీళ్ళ తోలుమందం చూసి ఆశ్చర్యపోయి, “చిన్న పాప చచ్చిపోతే అసౌకర్యం” అని ఎలా అంటారు…”, అని ప్రశ్నించగానే ఆ ట్వీట్ కూడా తీసేశారు. అసలు కళ్ళుమూసుకుంటే సరిపోతుందని అధికారులనుకున్నారేమో… స్పంచించాల్సిన అవసరం ఏంటి అనుకున్నారేమో… కానీసం ఆ చావుని కూడా లెక్క కట్టలేదు! నిజమే మారి, సామాన్యులకి చోటెక్కడ? అసలు చావులే లేవని తేల్చిచెప్పేశారు. ఆ మాట దయచేసి ఏడుస్తూ పదకొండవ రోజూ కార్యక్రమాలకి సిద్దమవుతున్న ఆ తల్లిదండ్రులకి ఎవరైనా దయచేసి చెప్పండి!!!
అది సరే..
మరి ప్రగతి భవనలో 11 నెలల ‘హస్కి’ కుక్క చచ్చిపోతే కేసు పెట్టిన అధికారులకు ఒక ప్రశ్న.. రుత్విక చావు “inconvenience” అయితే, ఈ కుక్కపిల్ల చావు కూడా అదే కదా? మరి కేసులు దేనికి? రుత్విక డెంగీతో చనిపోకపోతే, ఆ కుక్క కూడా డెంగీతో చావలేదు. అసలు రుత్విక చావు లెక్కలోకి రాకపోతే ఆ కుక్క కూడా చావలేదు!!!
లేదూ.. మీరు కేసులు పెట్టారు కాబట్టి దోమల మందు కొట్టిన GHMC మేయర్ బొంతు రామ్మోహన్, అసలు డెంగీ చావులే లేవని రాజకీయాలలో బిజీగా వున్న వైద్య శాఖా మంత్రి ఈటల, సోషల్ మీడియా కోసం హడావుడి చేసిన కేటీఆర్… వీరందరి మీద కేసులు ఎందుకు పెట్టకూడదు అని కడుపుమండిన జనం ప్రశ్న!
బ్రతుకు వృధా, చావు వృధా… దొర పాలనలో మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం! అంతేగా?
అమ్మా రుత్వికా, క్షమించు…నువ్వు ప్రగతి భవన్ లో కుక్కపిల్ల కాదుగా, మా లెక్కలోకి రాదు నీ చావు!