చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన రికార్డ్ ను నెలకొల్పాడు. ఐపీఎల్‌లో 1000 పరుగుల మార్క్ ను దాటాడు. దీంతో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో చేరాడు ఈ 25 ఏళ్ల బ్యాటర్.
ఐపీఎల్ లో 31 ఇన్నింగ్స్ ల్లో ఆడిన గైక్వాడ్.. ముంబై ఇండియన్స్ మాజీ బ్యాట్స్ మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు సచిన్ పేరుమీదున్న ఈ రికార్డ్ లో.. ఇప్పుడు గైక్వాడ్ భాగస్వామి అయ్యాడు.
వీరి తర్వాత సురేశ్ రైనా 34 ఇన్నింగ్స్‌లు, రిషబ్ పంత్ 35 ఇన్నింగ్స్‌లు, దేవదత్ పడిక్కల్ 35 ఇన్నింగ్స్‌లతో ముందువరసలో ఉన్నారు. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో జరిగిన మ్యాచ్ లో 57 బంతుల్లో 99 పరుగులు చేసిన గైక్వాడ్.. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
6 సిక్సర్లు, 6 ఫోర్లతో 99 పరుగులు చేసి.. తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. అయితే.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ్యాన్ షాన్ మార్ష్ పేరిట ఉంది. మార్ష్ కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు.