– తాత్కాలికంగా నిలిచిపోయిన పంపిణీ!
– నిధుల కొరతే కారణమా?
– టెక్నికల్ ఇష్యూ అంటున్న అధికారులు
– డబ్బులు వస్తాయా? రావా?
– అయోమయంలో అన్నదాతలు
తమ పథకాలు దేశానికే ఆదర్శం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఈ విషయాన్ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ.. వాస్తవంగా జరుగుతోంది వేరనేది బీజేపీ వాదన. రైతు బంధు పథకాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. ఈమధ్యే రైతు బంధు పథకం డబ్బుల పంపిణీ ప్రారంభమైంది. కానీ.. మూన్నాళ్ల ముచ్చటలా అది ఆగిపోయింది.
మూడు రోజుల పాటు 47.09లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,133.21 కోట్లు జమ చేశారు. అయితే.. జూన్ 30న మూడెకరాలున్న 10.78 లక్షలమంది రైతులకు చెందిన రూ.1,312.46 కోట్లకుగాను కొంతమందికే నగదు అందింది. జూలై 1న 4 ఎకరాలున్న 6.90లక్షల మంది రైతులకు రూ.1,146కోట్లు నిధులు జమ కావాల్సి ఉండగా.. కొంతమందికి మాత్రమే జమ అయినట్టు రైతులు తెలిపారు. జూలై 2న 5 ఎకరాలున్న రైతులకు అందాల్సిన రైతు బంధు నిధులు అందలేదని తెలుస్తోంది. పంపిణీలో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లంతోనే ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.
అయితే.. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. అధికారులు సాంకేతిక సమస్య అని చెబుతున్నా.. ఆర్థికశాఖ దగ్గర నిధులు లేనందుకే నిలిపివేసినట్లుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 68.10 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సీసీఎల్‌ఏ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కోటి 50 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించాలని నిర్ణయించారు. దీనికోసం మొత్తం రూ.7,521.80 కోట్ల నిధులు అవసరమని వ్యవసాయశాఖ లెక్కలు కట్టింది. కానీ.. ఇప్పటివరకు 47.09 లక్షల మందికి మాత్రమే సాయం అందింది.
మరో 21.01లక్షల మంది రైతులకు డబ్బులు జమ చేయాల్సి ఉంది. వీరందరికీ కలిపి రూ.4,388.59 కోట్ల నిధులు అవసరం ఉంటుంది. పైకి టెక్నాకల్ సమస్య అని చెప్పినా.. ఫండ్స్ లేకపోవడంతోనే మూడు రోజులకే పంపిణీని తాత్కాలికంగా నిలిపేసినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే డబ్బుల పంపిణీ చాలా ఆలస్యమైంది. ఇప్పుడు సగం సగం పనులు సాగుతుండడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు.