– బీఆర్ఎస్ లోకి వలసలు
– గులాబీ కండువా కప్పుకున్న రైతు నేత శరద్ జోషి
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
– అన్నదాతల పోరాటం వల్లే మోడీ దిగొచ్చారు
– రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామన్న సీఎం
నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులు, ఖలీస్తానీలని అన్నారని గుర్తు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతుల పోరాటంతోనే మోడీ దిగివచ్చి క్షమాపణ చెప్పారని తెలిపారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తన 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని చెప్పిన కేసీఆర్.. రైతుల శక్తి ఏంటో తెలుసన్నారు. అలాగే, అన్నదాతల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న కేసీఆర్.. మన ఆలోచనల్లో, ఆచరణల్లో నిజాయితీ ఉండాలని తెలిపారు. గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని.. రైతుల పోరాటం న్యాయబద్దమైందని.. వారు తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు.
హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేసిన రైతులపై బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా రైతులను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదని, గత ప్రభుత్వాలు తమ ప్రాంత ప్రజలను హింసించాయని, రోజుకు ఐదారుమంది రైతులు చనిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
ఢిల్లీ ధర్నాలో దాదాపు 750 మంది రైతులు అమరులు అయ్యారని, అయినా చెక్కు చెదరకుండా పోరాటం కొనసాగించారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారని గుర్తు చేసిన కేసీఆర్.. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక ఆత్మహత్యలు ఆగాయన్నారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండుతోందని.. అందులో 56 లక్షల ఎకరాల వరి తెలంగాణలోనే పండుతుందని తెలిపారు.
తెలంగాణలో ఏమేం చేశామో ఒకసారి వచ్చి చూడండంటూ సూచించారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును మీరంతా సందర్శించాలని కోరుతున్నానన్నారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది కాదని ఆరోపించారు. రైతుల పోరాటంపై ప్రధాని మోడీ కనీసం సానుభూతి చూపించలేదన్న ఆయన.. ఆ సమయంలో రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని పిలుపునిచ్చారు.