కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన తీసిన సినిమాలు చాలా వరకు ఎస్ అనే అక్షరంతోనే మొదలవుతాయి. అలా ఎందుకు అంటే ఎస్ అంటే సక్సెస్ అంటారు విశ్వనాథ్ గారు. ఆ సెంటిమెంట్ తోనే ఆయన నిర్మించే చాలా సినిమాలకు ఎస్ అక్షరం వచ్చేటట్లు చూసుకుంటారు.
క్రాంతి కుమార్, ఛటర్జీ కలిసి విశ్వనాథ్ తో సినిమా తీయాలనుకున్న సమయంలో ఈ సెంటిమెంట్ ఆరంభించారు ఆయన. అలా ఆయన దర్శకత్వంలో ఎస్ అనే అక్షరంతో మొదలైన టైటిల్‌తో తెరకెక్కిన తొలి చిత్రం శారద. ఈ సినిమా మంచి విజయం సాధించి క్రాంతి, ఛటర్జీలు నిర్మాతలుగా నిలదొక్కుకునేలా చేసింది.
ఆ తరువాత ఏడిద నాగేశ్వరరావు తన మిత్రులు కొందరితో కలసి వచ్చి సినిమా నిర్మించాలని విశ్వనాథ్ దగ్గరకు వస్తే వారితో సిరిసిరిమువ్వ తీశారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇక యువచిత్ర అధినేత మురారి నిర్మాతగా తొలి సినిమా విశ్వనాథ్ తోనే తీయాలని భావించారు. ఆయన అభిరుచికి తగ్గట్టుగా సినిమా తీస్తూ సీతామాలక్ష్మిని అందించారు.
ఈ సినిమా మంచి విజయం సాధించి తరువాత యువచిత్ర సంస్థ నిలదొక్కుకునేలా చేసింది. ఏడిద నాగేశ్వరరావు మరో నిర్మాత శ్రీరాములుతో కలసి విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన చిత్రమే శంకరాభరణం. ఆ సినిమా ఏ స్థాయిలో అలరించిందో చెప్పక్కర్లేదు. ఆ తరువాత కూడా ఆయన అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు.
అలా ఆయన దర్శకత్వంలో శుభోదయం, సిరిమువ్వల సింహనాదం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, శ్రుతి లయలు, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వరాభిషేకం, శుభప్రదం” వంటి సినిమాలు తెరకెక్కాయి.
కొత్త నిర్మాతలకే ఎస్ అనే లెటర్ సెంటిమెంట్‌ను పాటించక తనకు అనుకూలంగా సక్సెస్ కోసం ఎస్ తోనే ఎక్కువసార్లు సాగారు విశ్వనాథ్.