సినీ ఫాన్స్ తమ అభిమాన నటుడి చుట్టూ గిర్రున తిరుగుతూనే ఉంటారు. అభిమాన హీరో సినిమా హిట్ అయితే భలే జోష్… ఫట్ అయితే పొరుగు హీరోపై సెటైర్స్…. షరా మామూలే…! పిచ్చి అభిమానంలో జలసీ జరా కామన్ పాయింట్. తమ హీరోను పొగడ్తలతో ముంచెత్తడం.. పరాయి వారి హీరోలపై విమర్శలతో దుమ్మెత్తడం సహజమే…
వీరాభిమానులు తమ హీరో సినీ ప్రమోషన్ కోసం ఉచిత ప్రచారాలు, కలెక్షన్లు తగ్గితే టికెట్స్ కొనుగోలు చేసి హౌస్ ఫుల్ తంటాలు పడుతూనే ఉంటారు.
అయితే.. మంచి సబ్జెక్ట్, బెస్ట్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన మూవీని హిట్ కాకుండా ఎవరూ ఆపలేరు. సహజంగా పిక్చర్ ప్రమోషన్ కోసం ప్రొడ్యూసర్లు కొంత ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అంతటా భారీ ప్రచారం చేస్తారు. ఆ పిక్చర్‌లో సరుకుంటే మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అవుతుంది. ఎంత భారీ బడ్జెట్ పెట్టి తీసినా… కొమ్ములు తిరిగిన హీరో నటించినా… అభిమానులు ప్రచారంలో వీరంగం వేసినా…. సబ్జెక్టు… సరుకు బాగో లేకపోతే బ్రహ్మదేవుడు పూనుకున్నా సక్సెస్ చేయలేడు. ఇది సినీ ఫీల్డులో అనాదిగా చెబుతున్న సత్యం.
ఇటీవల సినీ పరిశ్రమలో నటులంతా తాము తీసిన అన్ని మూవీలు హిట్ కావాలని… పరిశ్రమ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి.. హీరోలు ఎంతో కష్టపడి తీసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోతే పరిస్థితి తారుమారే… అందుకే నేటి హీరోలు అభిమానులను నెగెటివ్ ప్రచారం చేయకుండా కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పక్క హీరోపై జలసీ ఉన్నా మూవీ హిట్ అయితే ఆ సబ్జెక్ట్ తమ హీరోకు రాలేదన్న నిరాశతో ఉంటారు తప్ప మరేమీ చేయలేరు.
హీరోలు, వారి ఫాన్స్ మధ్య పాలిటిక్స్ ఇలావుంటే.. నిజంగా రాజకీయ రంగంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి? సినీ అభిమానం ఒక్కోసారి వారిపై కూడా పడుతుంది. ఇప్పుడు టీడీపీ యువ నేత లోకేష్ పరిస్థితి అదే. తనకే మాత్రం సంబంధం లేకపోయినా ఈ సినీ వివాదాల్లో ఇరుక్కోవాల్సివస్తుంది. సినీ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం అతనిది. ఓపక్క తన మామయ్య బాలయ్య స్వయంగా పెద్ద హీరో. అంచేత అప్పుడప్పుడు ఈ సినీ రాజకీయం కూడా లోకేష్ తలకు చుట్టుకుంటుంది. తాజాగా ప్రభాస్ ఫాన్స్ పేరుతో కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు లోకేష్ ట్వీట్ చేయాల్సివచ్చింది. నిజానికి లోకేష్‌కు ప్రభాస్ అంటే ఇష్టం. బాహుబలి బాగా ఎంజాయ్ చేశాడు.
సోషల్ మీడియాలో లోకేష్‌ను టార్గెట్ చేయాలనుకున్న కొందరు అతను సాహో మూవీ చూడొద్దన్నారంటూ రచ్చ మొదలెట్టడంతో లోకేష్ అలెర్ట్ అయ్యారు. అందరి మాదిరిగానే ప్రభాస్ సాహో మూవీ చూడాలని ఆరాటపడుతున్నానని క్లారిఫై చేసేశారు. అడ్డగోలు ప్రచారాలు అభిమానులు నమ్మవద్దని ప్రకటించారు.
రాజకీయ అభిమానం… సినీ అభిమానం రెండు కోణాలు. బద్ద రాజకీయ విరోధులు కూడా ఒకే హీరోను అభిమానించే వారున్నారు… నిజానికి సినీ అభిమానానికి ఎల్లలు వుండవు. కుల, మత, రాజకీయాలకు అతీతం. నచ్చిన హీరో ఎవరని చూడరు. రాజకీయాలకు అనుగుణంగా అభిమానం పెంచుకోరు. రాజకీయ ఎత్తుల్లో భాగంగా ఫలానా లీడర్ ఫలానా హీరో సినిమాలు చూడవద్దంటూ ఫత్వా జారీ చేశారని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు ఒక వ్యూహాత్మక దుష్ప్రచారం. ప్రస్తుతం ఇది బాగా జరుగుతోంది. దాన్ని తిప్పికొట్టేందుకు ఆయా నేతలు స్వయంగా రంగంలోకి దిగి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.