గల్లీలో సిక్స్ ఎవ్వడైనా కొడతాడు… అని సాహో టీజర్‌లో ప్రభాస్ అన్నట్టు… ఫస్ట్ హాఫ్ ఏ యావరేజ్ మూవీలోనైనా ఓకే అనిపించుకుంటుంది. సెకండ్ హాఫ్‌లోనే సినిమా భవిష్యత్తు తేలుతుంది!
2 గంటల 50 నిమషాల నిడివి ఉన్న ‘సాహో’లో 55 నిమషాల పాటు కేవలం యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. మరి ఈ 300 కోట్ల సినిమాలో యాక్షన్ తప్ప ఏమైనా కంటెంట్ ఉంటుందా? 15 నిమషాల ఎడారి యాక్షన్ సీక్వన్స్ గురించే తెగ మాట్లాడుతున్నారు, మరి మిగతా పార్టులో సబ్జెక్టు మాటేంటి అనే ప్రశ్న మొదలైంది. ఒక లవ్ స్టోరీ, ఒక తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా రెగ్యులరే. పైగా సెంటిమెంట్ సీన్ల కన్నా, స్టైలిష్ సీన్లలోనే ప్రభాస్ టేలెంటు ఎక్కువ! ప్రీరిలీజ్ ప్రమోషన్… పబ్లిసిటీ చూస్తే ‘సాహో’.. ఓహో అనేలా అంచనాలు ఉన్నాయి. కానీ.. రియాలిటీలో సబ్జెక్ట్ పాత చింతకాయ పచ్చడే అని వినిపిస్తోంది.
సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలను బట్టి – ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపిస్తాడట. ఫిలింనగర్ ఛాయ్ అడ్డాలలో చర్చ మాత్రం డబల్ రోల్ కాదు, డబల్ షేడ్స్ ఉంటుందీ అంటున్నారు. డబల్ రోల్ అయితే తప్పకుండా ఫాన్స్‌కు పండగే! లేకపోతే పెద్ద ఎక్సైట్‌మెంట్ కూడా ఏదీ ఉండదు. చాలామంది సూపర్ స్టంట్ డైరెక్టర్స్ దీనికి పనిచేశారు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కొక్కరు చేశారని సమాచారం. ఈ ఎపిసోడ్స్ ఒక థ్రిల్లింగ్ సీక్వెల్ అవుతాయా..? లేక అతుకులుగా మిగులుతాయా…?
సెకండ్ హాఫ్ డల్‌గా ఉందని సెన్సార్ టాక్.. ఈ టాక్ ప్రకారం మితిమీరిన యాక్షన్ మొహం మొత్తొచ్చు. రిలీజ్ డే కలెక్షన్ 100కోట్లు దాటితేనే సినిమా గట్టెక్కుతుంది.
ఇప్పటికే ప్రీమియర్ బుకింగ్స్ తెలుగులో బావున్నా, తమిళ్-హిందీ ఎవరూ తెగ పట్టించుకోవడం లేదట. కేవలం ప్రభాస్ స్టైలిష్ లుక్, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే ట్విస్టులతో బాక్సాఫీస్ సాహో అంటుందా? లేదా సాహో ప్రభాస్ కొంప ముంచుతుందా..? కెరీర్ గ్రాఫ్ అప్ అవుతుందా… లేదా ఉఫ్ అనిపిస్తుందా…? ప్రభాస్ రెండేళ్ళ కష్టం ఫలిస్తుందా..? భారీ బడ్జెట్ మూవీ రేపు తెరపై ప్రతిఫలం చూపుతుందా? ఫాన్స్ టెన్షన్…టెన్షన్…! మూవీ ట్రేడ్ సర్కిళ్లలో మాత్రం ‘సాహో’ బాహుబలి రికార్డ్స్ తిరగ రాసేస్తుందన్న కాన్ఫిడెన్స్.