సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ 30వ తేదీన రిలీజ్ అవుతోంది. 2.51 గంటల నిడివి వున్న ఈ మూవీ అదిరిపోయిందని యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు వరుస ట్వీట్లు పెట్టారు. స్టార్ హీరోల సినిమాలకు కొన్ని రోజులకు ముందే సంధు ప్రీరివ్యూలు ఇస్తుంటారు. ఆ రివ్యూల్ని అంత సీరియస్‌గా తీసుకోనక్కర్లేదు. గతంలో సంధు సూపర్ హిట్ అని చెప్పిన అనేక సిన్మాలు ఫట్ అన్నాయి. సాహో మీద కూడా సారు వోవర్ ఎగ్జైట్‌మెంట్ ఫీలయ్యి.. ఫస్టాఫ్ తర్వాత వచ్చే సన్నివేశాలు చూస్తుంటే పిచ్చేక్కి పోతారని.. అసలు మనం ఇండియన్ సినిమా చూస్తున్నామా.. హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్నంత సంభ్రమాశ్చర్యాలకు గురవుతామని చెప్పుకొచ్చారు. సంధు ప్రీ రివ్యూ రిపోర్ట్ ఏమో కానీ.. సీన్ మాత్రం వేరేలా ఉంది.
ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ‘సాహో’ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ టాక్ చూస్తే డౌటొచ్చేస్తోంది. ఎన్నారైలు అందిస్తున్న వివరాలను బట్టి ఇక్కడ మన దగ్గర ప్రచారం జరుగుతున్నంత ఓవర్‌గా అక్కడ హడావుడి కనిపించడం లేదంట. ఆన్‌లైన్ బుకింగ్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ టాప్ లేపేస్తున్నాయని ఇక్కడ చేస్తున్న క్యాంపేన్ అంతా ఒఠ్టిదే అనిపిస్తోంది. చాలాచోట్ల ఆన్‌లైన్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగే కాలేదు. బాహుబలి సీరిస్‌లో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ మూవీల తరువాత వస్తున్న ప్రభాస్ సినిమా కాబట్టి ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయ్ కానీ.. ఇక్కడున్న ‘సాహో’ ఫీవర్ ఓవర్సీస్‌లో అస్సలు కనిపించడం లేదట. ‘కనీవినీ ఎరుగని క్రేజ్.. ఆన్ లైన్ బుకింగ్ టికెట్స్ హాట్ కేక్స్…’ అనే మాటలు వినడానికి ఇక్కడ వినసొంపుగానే ఉన్నాయి. అక్కడ రియాలిటీ డిఫరెంటుగా ఉంది. అసలు మన దగ్గరే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లోనూ ఇంకా టిక్కెట్లు అమ్మడం మొదలెట్టనే లేదు. ప్రతి స్క్రీన్‌లోనూ నిముషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయని సోషల్ మీడియాలో, వెబ్ పోర్టల్స్‌లో హోరెత్తిస్తూ సినిమాను మోసేస్తున్నారు. నిజానికి విజయవాడలో ఈ వార్త రాసే సమయానికి ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయనేలేదు. ఒక్క గుంటూరులోనే ఆన్‌లైన్ బుకింగ్ షురూ అయ్యింది. హైదరాబాద్‌లో ఏ కొత్త సినిమాకైనా.. ఆఖరికి అది అబోవ్ యావరేజ్ అనే టాక్ వున్న మూవీ అయినా సరే.. ఫస్టు రెండు, మూడు రోజులు టిక్కెట్లు దొరకనే దొరకవన్న సంగతి తెలిసిందే.
ఇక తెలుగు కాకుండా వేరే భాషల్లో వస్తున్న ‘సాహో’ వెర్షన్లయినా మోత మోగిస్తున్నాయా అంటే అక్కడ కూడా అంత సీన్ లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ నటించే సినిమాలకే ఆన్‌లైన్ బుకింగ్ అంతంత మాత్రం అక్కడ. కాకపోతే, బాహుబలి తరువాత ప్రభాస్ ఆలిండియా స్టార్ అయిపోయి లేడీస్‌లో తెగ ఫాన్ ఫాలోయింగ్ పెంచుకుని పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రీ రిలీజ్ బిసినెస్‌తో దుమ్మురేపిన ‘సాహో’ అదే స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ విషయంలో కూడా హుషారు ఇస్తుందని ఆశించిన సినిమా యూనిట్ ఓవర్సీస్ నుంచి వస్తున్న మార్కెట్ రిపోర్ట్ చూసి కంగారుపడుతున్నట్టు సమచారం. ఓవరాల్‌గా వినవచ్చేదీ… చెప్పొచ్చేదీ ఏంటంటే యుఎస్, పారిస్, యూకే, యుఏఈ, ఆస్త్రేలియాల్లో ‘సాహో’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతోందని బీభత్సంగా జరుగుతున్న క్యాంపేన్ నమ్మేసి ఆనక తీరిగ్గా నిట్టూర్చద్దు. నివ్వెరపోవద్దు.