23 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కుని దేశంలో మహిళా క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచిన టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు సౌరవ్ గంగూలీలు ప్రశంసలు కురిపించారు. మిథాలీ దేశంలో లక్షలాది మందికి స్పూర్తినిచ్చిందని సచిన్ కొనియాడాడు. మిథాలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథు’ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా సచిన్, గంగూలీలు మిథాలిపై ప్రశంసలు కురిపిస్తూ.. ట్వీట్ లు చేశారు.
‘‘శభాష్ మిథు ట్రైలర్ హృదయానికి హత్తుకునేలా ఉంది. మిథాలీ దేశంలో లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. ఈ చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు..’’ అని ట్వీట్ చేశారు సచిన్ టెండూల్కర్.
అంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. #GirlWhoChanged Game అనే హ్యాష్ ట్యాగ్ తో శభాష్ మిథు ట్రైలర్ ను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు గంగూలీ.
అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిథాలీగా తాప్సీ ఆకట్టుకుందని అభిమానులు అంటున్నారు. గతంలో పలు మహిళా ప్రధాన చిత్రాల్లో నటించిన తాప్సీ.. మిథాలీ బయోపిక్ లో తన ప్రాణం పెట్టి నటించిందని కామెంట్స్ చేస్తున్నారు.