ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో తాజాగా టెస్టుల్లో 10,000 పరుగల మైలురాయిని అందుకున్నాడు. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో రూట్ ఈ ఘనత సాధించాడు. దాంతో టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు చేసిన 14వ ఆటగాడిగా రూట్ నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో ఈ రికార్డును సాధించిన రెండో ఇంగ్లండ్ బ్యాటర్ గానూ నిలిచాడు. రూట్ ఆటతీరును ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసించారు.
కాగా.. టెస్టుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల (15,921) రికార్డును జో రూట్ అధిగమిస్తాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ‘ఇంగ్లండ్ జట్టులో జో రూట్ అత్యుత్తమ క్రికెటర్. దిగ్గజ బ్యాటర్ గ్రహమ్ గూచ్ సరసన రూట్ నిలుస్తాడని నేను నమ్ముతున్నా. ఇప్పుడు రూట్ ఆడుతున్న తీరును బట్టి చూస్తే.. టెస్టుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడు. సచిన్ కన్నా 6వేల పరుగులు మాత్రమే తక్కువ ఉన్నాయి. రూట్ వయస్సు 31 ఏళ్లే. జేమ్స్ అండర్సన్ మాదిరి 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడితే.. సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమి కాదు’ అని అభిప్రాయపడ్డాడు.
రూట్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. గత 18-24 నెలలుగా అతను ఇలా బ్యాటింగ్ చేయడం నేనెప్పుడూ చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ పేర్కొన్నాడు. అతను తన కెరీర్ లోనే గొప్ప ఫామ్ లో ఉన్నాడని తెలిపారు. రూట్ కు ఇంకా 5 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యంగా ఉంటే 15,000 పరుగులు చేయడం తనకు కష్టమేమి కాదని వివరించారు. సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ సాధించగలడని భావిస్తున్నానని పేర్కొన్నాడు. రూట్ ఇప్పటివరకు 118 టెస్టుల్లో 10,015 పరుగులు చేశాడని.. అందులో 26 శతకాలు, 53 అర్ధ శతకాలు ఉన్నాయని తెలిపారు టేలర్.
ఈ నేపథ్యంలో స్కై స్పోర్ట్స్‌తో ఇంగ్లీష్ మాజీ సారథి నాజర్ హుస్సేన్ మాట్లాడాడు. జో రూట్ ఎప్పుడూ ప్రపంచ స్థాయి ఆటగాడేనని కొనియాడారు. అతని టెక్నిక్ చాలా బాగుంటుందని వివరించాడు. ఆటలో మంచి లయ, పట్టును కలిగి ఉన్న ఆటగాడు రూట్ అని పేర్కొన్నాడు. అతనిలో ఇంకా పరుగులు చేసే సత్తా ఉందని.. పరుగుల ప్రవాహం పారించగలడని నేను నమ్ముతున్నానని వివరించాడు. 10,000 టెస్ట్ పరుగులు చేయడం చాలా ప్రత్యేకమన్నారు నాజర్ హుస్సేన్.