మొట్టమొదటి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుని భారత్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ లో అధ్బుతమైన ఆట తీరు ప్రదర్శించి ప్రపంచ విజేతగా నిలిచింది. దీంతో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 5కోట్ల నజరానాను బీసీసీఐ ప్రకటించింది.
జట్టు సభ్యులను సత్కరించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. రేపు మూడో టీ20లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును సత్కరించనున్నారు. జట్టు సభ్యులను క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా సత్కరించనున్నారు.
ఈ మేరకు విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు. ప్రపంచ కప్ గెలిచిన అండర్ 19 మహిళా జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జట్టు సభ్యులను బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సత్కరించనున్నట్టు చెప్పారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచకప్ గెలిచి యువ క్రికెట్లర్లు మన దేశాన్ని గర్వపడేలా చేశారని ఆయన కొనియాడారు.