సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్నుమూశారు. గతకొంత కాలంగా తాతినేని రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. 1938లో కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. ఆయన మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది.
తాతినేని రామారావు 1950లలో టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. అనంతరం 1966లో నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో ‘నవరాత్రి’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తొలి అడుగువేశారు. దాదాపు 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. కాగా, హిందీలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన తెలుగు దర్శకుడిగా రామారావు హిస్టరీ క్రియేట్ చేశారు.
యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. అలాగే, రాజేంద్రప్రసాద్‌తో గోల్‌మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు.
అంతేకాదు, ‘అంధా కానూన్’తో రజినీకాంత్ ను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. కమల్ హాసన్‌తో ‘యే తో కమాల్ హోగయా’, జితేంద్ర, మిథున్ చక్రవర్తితో పలు హిందీ సినిమాలు తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్‌తో ‘అంధా కానూన్, ఇంక్విలాబ్’ చిత్రాలను తీశారు. ఇక తెలుగులో తాతినేని రామారావు చివరి చిత్రం `గోల్ మాల్ గోవిందం`, హిందీలో ‘బేటీ నంబర్ వన్’గా తెరకెక్కించారు.