ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బషీర్ బాగ్, పీసీఆర్ జంక్షన్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, రాణిగంజ్, నల్లగుట్ట, నాంపల్లి, తెలుగు తల్లి, నారాయణ గూడ, హిమయత్ నగర్, కవాడి గూడ తదితర
కూడళ్లలో ట్రాఫిక్ ను మళ్లించారు.
అయితే ఎల్బీ స్టేడియం, లిబర్టీ జంక్షన్ తో పాటు అప్పర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే ఎల్బీ స్టేడియంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గౌరీ పూజలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మలు, కళాకారుల ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో మహిళలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.