సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని 300మంది సఫాయి కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ.. సికింద్రాబాద్ లో కార్మికులు అఖిలపక్షం నేతల ఆధ్వర్యంలో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. గత ఇరవై ఏళ్లుగా చెత్తను సేకరించడాన్ని జీవనోపాధిగా కొనసాగిస్తున్న తమను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిల పక్షం నేతలు కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు సంకీ రవీందర్, సీఐటీయూ నగర నాయకులు ఈశ్వర్ రావు, ఆర్ మల్లేష్, ప్రముఖ న్యాయవాది ఓబులేష్ కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లో సైతం వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేశారని పేర్కొన్నారు.
వారి కష్టం ఫలితంగానే కేంద్రం నుండి రాష్ట్రానికి బహుమతి లభించిందన్న విషయాన్ని కంటోన్మెంట్ సీఈఓ గుర్తుంచుకోవాలని అన్నారు. దాదాపు ఇరవై, ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న 300మంది కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం అమానుషమైన చర్య అని అన్నారు. వారి మీద ఆధారపడి జీవిస్తున్న దాదాపు 1200 మంది కుటుంబ సభ్యులు రోడ్డుమీద పడే పరిస్థితి వచ్చిందని వివరించారు.
తమ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అఖిలపక్షాల ఆధ్వర్యంలో వారికి మద్దతుగా కంటోన్మెంట్ ప్రజలంతా ఉద్యమాలు చేస్తారని వారు హెచ్చరించారు.